తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday 17 May 2011

గుడి - part 2




                                                                                                                        contd.....
                                                                                        

Thursday 12 May 2011

నీకు నేనేం ద్రోహం చేశాను నాన్నా? నన్నెందుకు చంపావు?

(కర్నూల్ లో నిన్న జరిగిన దారుణానికి (ఆడపిల్ల కడుపులో ఉందని స్కానింగ్ లో తెలుసుకుని భార్యను, కడుపులోని బిడ్డను కిరాతకంగా చంపేసిన ఉదంతం), బలై పోయిన ఆ పసిబిడ్డ మనోగతం ఇలాగే ఉంటుందేమో)


నీకు నేనేం ద్రోహం చేశాను నాన్నా? నన్నెందుకు చంపావు?


మీ అందరితో సంతోషం
పంచుకోవాలనుకున్నాను.
నిన్ను, అమ్మను ఎప్పుడెప్పుడు 
చూస్తానా అని అమ్మ పొట్టలో
కలలు కంటూ గడిపాను.
ఆ అమ్మ పొట్టలోనే 
నన్నెందుకు చంపేశావు నాన్నా?

ఆడపిల్ల గా పుట్టబోవడమేనా...
నేను నీకు చేసిన ద్రోహమా?
అలా అయితే నిన్ను కన్నది కూడా 
ఓ ఆడదే కదా నాన్నా?
మీ అక్క, మీ చెల్లి కూడా 
ఆడవాళ్ళే కదా... మరి వారినెందుకు చంపలేదు.
ఓ... నిన్ను కని, పెంచి పోషించింది ఒకరు, 
నీ తోబుట్టువులు మరొకరనా....

మరి నేను కూడా నీ రక్తం 
పంచుకున్నాగా నాన్నా.....
నన్నెందుకు చంపావు?

అయినా మా ఆడవాళ్ళు నీకేం ద్రోహం
చేశారని నామీద, అమ్మ మీద
కసి పెంచుకుని మమ్మల్ని చంపేశావు.

తనవాళ్ళందరని వదిలి,
నీకు, నీ కుటుంబానికి ఊడిగం చేసి,
నీ అవసరాలు తీర్చి, నీకు సుఖాన్నిచ్చిన
పాపానికా.... అమ్మను చంపావు?

అమ్మ ఒడిలో కమ్మగా నిద్ర
పోవాల్సిన నన్ను, నీ కసాయితనం తో
శాశ్వతంగా నిద్రపుచ్చావు.

అమ్మ పాలు తాగుతూ, లాలి పాటలు వింటూ,
కేరింతలు కొడుతూ ఆడుకోవాల్సిన నన్ను 
మొగ్గలోనే చిదిమేసి విలవిలలాడుతూ
చావుబతుకుల మధ్య కొట్టుకుంటూ
చచ్చేలా చేశావు....

నీ గుండెలపై పడుకుని,
నీ వేళ్ళు పట్టుకుని నడక నేర్చుకోవాలని
చాలా ఆశ పడ్డాను నాన్నా....కానీ
నాకు జీవితమే లేకుండా చేసేశావు నువ్వు.
నువ్వసలు నాన్నవే కాదు.

కష్టంలో, సుఖంలో ఎల్లవేళలా
కంటికి రెప్పలా చూసుకుంటానని
ప్రమాణం చేసి మరీ అమ్మను చంపేశావు.
నువ్వసలు భర్తవే కాదు.

కాదు కాదు... నువ్వసలు మనిషివే కాదు
ఒక కసాయి వాడివి...
మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడివి....
రక్తం పీల్చే పిశాచివి......


(బిడ్డ కడుపులో ఉండగానే ఆడపిల్ల అని తెలిస్తే చాలు చంపడం మనిషి చేసే పని కాదు. ఆడపిల్ల అయినా, మగ పిల్లాడు అయినా ఎవరైనా ఒకటే. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. భ్రూణహత్యలను నిరసనతెల్పండి. పసిపిల్లలను కాపాడడంలో చేయి చేయి కలపండి.)


Wednesday 11 May 2011

చైత్రమాస వెన్నెల వేళ మల్లె పువ్వుల సోయగం......

మల్లెపువ్వు....         King of All Flowers.............


మంచుకురిసే వేళలో...మల్లె విరిసేనెందుకో......


చైత్రమాస వెన్నెల్లో చిరుగాలికి మనసారా నవ్వుతూ తలలూపే విరబూసిన మల్లెపూలను చూస్తే మనసు పులకరించిపోతుంది.
మైమరపించే సువాసన మనల్ని ఎక్కడో విహరించేలా చేస్తుంది.


మగువల మనసు దోచే అపురూప పుష్పం. మల్లెపువ్వును ఇష్టపడని అతివ ఉండదు అంటే అదేం అతిశయోక్తి కాదు.
తెలుపుకే అసూయపుట్టించే శ్వేతవర్ణ పుష్పం మల్లెపువ్వు.
మల్లెపూలు పసిపాపల్లా నవ్వేపువ్వులు. అతి సున్నితమైనవి.
గుండుమల్లె, సెంటుమల్లె, కాగడామల్లె, దొంతరమల్లె, చమేలి, విరజాజి, సన్నజాజి....... ఇలా ఎన్నో పేర్లతో మల్లెపూలను పిలుస్తారు.
మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పువ్వు మల్లెపువ్వు.
థయ్‍లాండ్ లో అమ్మకు ప్రతిరూపం గా మల్లెపువ్వును భావిస్తారు.
పాకిస్తాన్, టునీషియా, ఫిలిప్పైన్స్ దేశాల జాతీయపుష్పం మల్లె.
మనసు దోచేయడంలో మల్లెపువ్వు కు సాటిరాగలపువ్వు మరొకటి లేదు.
మల్లెచెట్టు వేరు బీరువాలో ఉంచితే సంపద పెరుగుతుందని ఉత్తరాది వారి నమ్మకం.
భర్త మల్లెపూలు తెస్తే ఆ భార్య మురిసిపోతుంది. జడలో తురుముకుని తన అందం ఇనుమడింపచేసుకుంటుంది.
మల్లెపూలను పసిపాపల్లా పెంచుతారు. చక్కగా పందిరి అల్లిస్తారు.  దీనికి నీరుతడి ముఖ్యం. ఇసుకనేలల్లో మల్లెతోటలు ఎక్కువ.


ప్రతిపెళ్ళిలోను మల్లెలు సందడి చేస్తాయి. అందరిని మురిపిస్తాయి.
అంతేకాదండోయ్...... మల్లెల వల్ల అనేక లాభాలున్నాయి.
మల్లెపూలను అరోమా థెరఫీ లో, ఆయుర్వేదం లో విరివి గా ఉపయోగిస్తారు.
మల్లెలు నరాలపై మంచి ప్రభావం చూపుతాయి.
వేసవిలో మల్లెపూల పరిమళం మనసుకు చాలా ఉపశమనం కల్గిస్తుంది.
కీళ్ళనొప్పులు, చర్మ రోగాల నివారణలోను ఉపయోగపడుతుంది. మల్లెల నుండి తీసిన నూనె తలనొప్పికి మంచి నివారణా మార్గం.
మల్లెపూల ఆకులు డికాషన్ చేసుకుని తాగితే నులిపురుగులు చనిపోతాయ్......


ఇన్ని సుగుణాల మల్లె....నిజంగానే......సిరిమల్లె...పువ్వే................