తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday, 19 June 2017

సప్తవర్ణాల్ని స్నేహంగా పలుకరించి

 మేఘాల పొత్తిళ్ళలో పడుకున్న
 చందమామ చెక్కిలి మీద నుండి

 గులాబి రంగును..

వాగుల్లోను..వంకల్లోను..
నీటి తరంగాలతో దోబూచులాడుతూ..

వయ్యారంగా సాగిపోయే
చేపపిల్ల కళ్ళలోంచి నీలిరంగును..

వెన్నెల తాకిడికే కందిపోయి
 మంచులో శీతలస్నానం చేసే

 సన్నజాజుల రేకుల్లోంచి తెల్లని తెలుపును..

నక్షత్రాలు ఊసులాడుకుంటున్న వేళ..

చెదిరిన చీకటిలో నుండి నలుపును..

ముగ్గులకు రంగులద్దే తెలుగింటి
సిగ్గులమొగ్గ బుగ్గల అరుణిమని....

సూర్యుడికన్న ముందే చూసి పట్టుకుని

అందులోంచి ఎరుపు పసుపుల్ని మిళితం చేసి..

నా మనసులోని భావాలను
కుంచెగా మలిచి..
కలల కాన్వాసుపై
ఒక అందమైన చిత్రరాజాన్ని సృష్టించాను.....

Sunday, 18 June 2017

నాన్నా! చిన్నప్పుడు నీ గుండెలపై పడుకోబెట్టుకుని....

నాన్నా!
చిన్నప్పుడు నీ గుండెలపై పడుకోబెట్టుకుని
రాముడి గురించి, కృష్ణుడి గురించి చెప్పావు.
వాళ్లు ఎలా జీవించారో చెప్పావు.
కానీ - నువ్వు లేకుండా
నేను ఎలా బ్రతకాలో ఎందుకు చెప్పలేదు నాన్నా!
వాళ్ళు రాక్షసుల్ని ఎలా ఎదుర్కొన్నారో చెప్పావు.
ప్రతిరోజు ఎదురయ్యే ఈ రావణాసురులను ఎలా ఎదుర్కోవాలో చెప్పడం మర్చిపోయావు.
నువ్వు నా పక్కనున్నన్ని రోజులు నాకుతెలియలేదు లోకమంటే ఏమిటో
ఎందుకంటే అప్పుడు నువ్వే నా లోకం 
నువ్వెళ్ళిపోయాకే తెలిసింది
ఈ లోకం నిజస్వరూపం.
బంధువులంటే రాబందువులనీ,
స్నేహమనే ముసుగేసుకున్న అవకాశవాదులనీ.
అడుగడుగునా ద్రోహాలే.. అడుగడుగునా మోసాలే.
మానవత్వం మరిచిన 'మనీ'షులమధ్య బతుకుతో పోరాటం.
నిస్సహాయత్వం, నైరాశ్యం, బేలతనం వెరసి
ఇంతపెద్ద ప్రపంచంలో ఒంటరినయ్యా.
ఏం చెయ్యాలో తెలియక,ఎటు అడుగులెయ్యాలో పాలుపోక,
కన్నీరింకిపోయేలా వెక్కెక్కి ఏడ్చా
గుండెలవిసేలా పిచ్చివాడిలా
ఎవరూ లేని నిర్మానుష్యంలో 
పిచ్చిపిచ్చిగా అరిచి కేకలు పెట్టా.
నీమీద కోపం- నువ్వెళ్ళిపోయావని.
ఒక్కోసారి అనిపించేది
నీ దగ్గరికి వచ్చెయ్యాలని,
కానీ రాలేని పరిస్థితి.
కానీ,
చీకటిని చీల్చే సూర్యుడిలా
నువ్వు పంచిన రక్తం,
నీవారసత్వంగా నాలోని ధైర్యం
ఈరోజు నన్నిక్కడ నిలిపాయి.
ఆ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే
ఒకటే కోరుకుంటాను...
మా నాన్నని ఒక్కసారి చూపించు అని.
నాన్నకు ప్రేమతో.. - కోటేశ్వరరావు యెర్రంశెట్టి