తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 27 June 2014

పుష్కరాలను ఎలా నిర్ణయిస్తారు?? త్రివేణీ సంగమమంటే ఏమిటి?

పుష్కరాలను ఎలా నిర్ణయిస్తారు??
త్రివేణీ సంగమమంటే ఏమిటి?? ఎక్కడెక్కడ ఉన్నాయి??
ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. అందులోను జీవనాధారమైన నీటికి నిలయమైన నదులను దేవతలుగా పూజిస్తాం. జనజీవితమంతా నదులతోనే ముడిపడి ఉంది. నదులు ప్రవహించే ప్రాంతాలే నగరాలైనాయి. నాగరికత పెంపొందించటానికి నదులే కారణం. 'హిందు' అనే పదం సింధు నుంచే వచ్చింది. చినుకులా రాలి, ఏరులై పారి, నదులుగా మారి, వరదలై పొంగి, కడలిచేరే దశలలో ఎన్ని మలుపులు! ఎన్ని సొగసులు! ఎన్ని కడగండ్లు! ఎన్ని పరిమాణాలు! కఠిన శిలల్లో ప్రయాణం, అవరోధాలను అధిగమించటం, కాలుష్యాలను భరించటం, పయనించినంత దూరం నేలతల్లిని సస్యశ్యామలంగా మార్చటం, పుణ్యక్షేత్రాలలో భగవంతునికి తనవంతు కైంకర్యం సమర్పించటం, క్షేత్రాన్ని తన తీర్థంతో పావనం చేయటం, ఉపనదులను కలుపుకోవటం, ప్రకృతి భీభత్సాలను భరించటం, నాగరికత తెచ్చే మార్పులన్నీ సహించటం చూస్తే నది మనకు ఒక మహోన్నత మార్గదర్శిగా కనిపిస్తుంది. నదీతీరాలన్నీ పుణ్యక్షేత్రాలకు నిలయాలే. నది మన సంస్కృతిలో ఎంత ప్రధానపాత్ర వహిస్తుందంటే మనం సంకల్పం చెప్పుకుంటూ, మన ఉనికి తెలుపుతూ (గంగా గోదావర్యోర్మధ్యప్రదేశ్) ఏఏ నదుల మధ్య ఉన్నామో చెప్పుకుంటాం.
వామనావతారంలో ఆకాశానికెత్తిన విష్ణుపాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడిగాడట. ఆ పవిత్ర జలమే విష్ణు పాదోద్భవ అయిన గంగానదిగా అవతరించింది.
పరమశివుడు తన జటాజూటంనుండి గంగను వదిలేటప్పుడు, ఆయన దాన్ని ఏడుపాయలుగా వదిలాడు. మూడు పాయలు (హ్లాదిని, పావని, నళిని) తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మరో మూడు పాయలు (సుచక్షువు, సీతా, సింధు) పశ్చిమ దిక్కుగా వెళ్ళాయి. ఏడవపాయ భగీరధుడిని అనుసరించి వచ్చింది. భగీరధుడు ఒక దివ్యరధంలో ముందు ప్రయాణం చేస్తుండగా, గంగ ఆ రధం వెనకే ఉరవళ్ళు, పరవళ్ళతో ప్రవహిస్తూ వెళ్ళింది, ఈ ప్రయత్నానికి సమకట్టిన భగీరధుని పేరుమీదుగానే ఆ నదికి భాగీరథి అని పేరు వచ్చింది.
భాగీరధి, జాహ్నవి, అలకనంద ఉపనదులు కలసి హరిద్వార్ వద్ద గంగగా ప్రయాణం సాగించాయి. నదులన్నీ ఆ గంగాదేవికి ప్రతిరూపాలుగానే భావిస్తారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమాన్ని 'త్రివేణి సంగమం' అంటారు. ఆ పవిత్ర భూమి ప్రయాగ. యమున సూర్య తనయ. జన్మస్థానం యమునోత్రి.
నీలమేఘశ్యాముని యమునా తీర రాసలీలలకు ప్రత్యక్షసాక్షి. తాను నల్లగా వుండి ఆ నల్లనయ్యనకు ప్రీతిపాత్రురాలైంది.
ఇక సరస్వతి బ్రహ్మపత్ని. వాగ్దేవి, జ్ఞాన ప్రదాయిని. త్రివేణి సంగమ ప్రాంతంలో సరస్వతి అంతర్వాహిని, పన్నెండేళ్ళకొకసారి గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలొస్తాయి. ఉదాహరణకు గురుడు మేషరాశిలో ప్రవేశిస్తే గంగాక్, కర్కాటకరాశిలో ప్రవేశిస్తే యమునకు, మిథునరాశిలో ప్రవేశిస్తే సరస్వతికి సింహరాశిలోకి ప్రవేశిస్తే గోదావరికి, తులారాశిలోకి వస్తే కావేరికి, కన్యారాశిలోకి వస్తే కృష్ణా నదికి ఇత్యాదిగా పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో ఆయా నదులలో సమస్త దేవతలు ఉంటారనీ, పుష్కర స్నానం పాపాలను కడిగివేస్తుందని అంటారు.

Friday, 30 May 2014

ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి

ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి వంతెన దాటుతున్నారు. తండ్రి, తన పాప ఎక్కడ పడిపోతుందో నని, పాపతో ఇలా అన్నారు,'చిన్న తల్లి, నా చెయ్యి పట్టుకో, అప్పుడు నువ్వు, నదిలో పడిపోకుండా ఉంటావు.'
అప్పుడు ఆ పాప ఇలా అంది,'లేదు నాన్నగారు, మీరే నా చెయ్యి పట్టుకోండి'.
'ఏమిటి తేడా' అని తండ్రి ఆశ్చర్యంగా అడిగేరు.
'చాలా తేడా ఉంది నాన్నగారు' అని పాప సమాధానం చెప్పింది.
'నేను మీ చెయ్యి పట్టుకుని, నాకు ఏమైన అయితే, నేను మీ చెయ్యి వొదిలెయచ్చు కదా. కాని మీరు నా చెయ్యి పట్టుకుంటే నాకు ఖచ్చితంగా తెలుసు, ఏది ఏమైన, మీరు నా చెయ్యి వొదలరు అని'.
నీతి :-
భగవంతుడు మనందరికి తండ్రి. భగవంతుడిని మనం వదులుకోవాలి అని అనుకున్నాఆయన మనల్ని వదలరు.
భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి, ప్రేమతో, భక్తి తో కట్టెయ్యాలి.

ఒక తండ్రి, ఒక కొడుకు.....

రోజూ కొడుకు చెయ్యి పట్టుకుని కబుర్లు చెబుతూ..
కొడుకేమో తండ్రి చెప్పే మాటలు వింటూ ఊ కొడుతూ..
బాబుని ఆ రోజు కూడా స్కూల్లో వదిలి వచ్చాడు తండ్రి రోజులానే...
ఉన్నట్టుండి మూడంతస్థుల స్కూల్ భవనం కూలిపోయింది,పిల్లల్లో ఈ కొడుకు,
ఇంకా కొంతమంది భవన శిధిలాల మధ్య ఏమీ కాలేదు కానీ,చుట్టూరా పడిపోయిన
గోడల మధ్యన చిక్కుకుపొయ్యారు,ఆ కొడుకు నాన్న,నాన్న అని అరుస్తూనే ఉన్నాడు..
కొంత సేపటివరకు ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు పిల్లలకి..కాసేపటికి విషయాన్ని
అర్ధం చేసుకున్న పిల్లలు ఆ బాబు దగ్గరికి వచ్చి 'ఎందుకురా,అంతలా అరుస్తున్నావు,ఎవ్వరికీ ఏమీ వినిపించదు అని ఏడుపు గొంతులతో,దిగులు ముఖాలతో అడిగారు..అప్పుడు ఆ బాబు చెప్పాడు "మా నాన్న ఎప్పుడూ నాతో చెప్పేవారు,నీకు భయం వేసినా,బాధ కలిగినా..నాన్న అని తలుచుకో, లేదా నన్ను పిలు , నేను తప్పక నీ దగ్గరికి వస్తాను,ఆలస్యంగానైనా నిన్ను వెతుక్కుంటూ నేను ఎక్కడికైనా వస్తాను, అని చెప్పి , మళ్ళీ గట్టిగా నాన్నా,నాన్నా అని అరవటం మొదలు పెట్టాడు...ఇంతలో చుట్టూ ఉన్న పడిపోయిన గోడల శిధిలాల నుంచి ఏవో శబ్దాలు రాసాగాయి..పిల్లలకి భయం పెరిగి గట్టిగా ఏడ్చేస్తున్నారు,బాబు మాత్రం ఒకటే మాట "నాన్నా,నాన్నా..అంటూ ఒకటే పిలుపు....కొంతసేపయిన తర్వాత శిధిలాలు తొలగించి బయటినుంచి ఆ బాబు తండ్రి,కొంతమంది సహాయక సిబ్బంది చేతులు అందించి ఆ పిల్లల్ని,బాబుని బయటికి తీసారు....ఆ మిగిలిన పిల్లల తల్లితండ్రులు,ఆ తండ్రిని ఒకటే మాట అడిగారు,మీకెలా తెలుసు, మీ బాబు పిలుస్తాడని,కొన్ని శిధిలాలు తొలిగించేదాకా మాకెవ్వరికీ వినిపించని పిలుపు మీకెలా వినిపించింది, అప్పుడు తండ్రి చెప్పాడు "నా బాబుకి నా మాటల మీద నమ్మకం ఎక్కువ,వాడు ఏ కష్టం వచ్చినా నాన్న అంటూ నన్నే పిలిచి,నేను వాడి దగ్గరికి వెళ్ళే వరకు ధైర్యం కోల్పోడు,మా బాబుకున్న ఆ నమ్మకమే వాడిని ఏ సంఘటన అయినా పోరాడేలా చేస్తుంది,నేను వాడికి సహాయహస్తం అందించేవరకు, అని చెప్పాడు....ఆ తండ్రికి,కొడుక్కి మధ్య ఉన్న కనపడని,కూలిపోని గట్టి వారధి ఆ నమ్మకమే....ఆ నమ్మకమే ఆ బాబుతో పాటూ ఇంకో నలుగురు పిల్లలకు ధైర్యాన్ని,ప్రాణాన్ని పోసింది....నమ్మకమే జీవితం,నమ్మకమే అనుబంధం,నమ్మకం శాశ్వతం.......

Saturday, 17 May 2014

మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కాని బంధాన్ని కాదు"

"గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం,


వెళ్ళను కాదు కదా!


అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు


కోపతాపాలను కత్తిరించాలి కాని 


బంధాన్ని కాదు"