తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday, 20 May 2015

మే 20వ తేదీ పిచ్చుకల దినోత్సవం మరియు మే 22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా...

www.onenandyala.com

నేడు అంతర్జాతీయ 'జీవవైవిధ్య దినోత్సవం'. మే నెల 20వ తేదీన 'పిచ్చుకల దినోత్సవం' కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో 'జీవవైవిధ్యం' గురించి, అందులో పిచ్చుకల పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం.  ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి.
తమ అమృతధ్వనులతో మనల్ని నిద్రలేపి, తిరిగి సాయంసంధ్యవేళకల్లా గూళ్ళకు చేరుకుని తమ కువకువనాదాలతో మనల్ని కుశలమా అని అడుగుతూ మన జీవితంలో భాగంగా  మారిపోయిన మన పిచ్చుక స్నేహితులు ఇప్పుడు ఎక్కడ?  టెక్నాలజీ పెరిగింది ... మనుషుల మధ్య అంతరాలు పెరిగాయి.. ఒకే ఇంట్లో ఉంటూ మొబైల్ లో మాట్లాడుకునే రోజులు వస్తున్నాయి.  సెల్ టవర్ల రేడియేషన్ ధాటికి మన పిచ్చుక స్నేహితులు మనకి దూరమైపోయాయి. చివరికి పిచ్చుక జాతే అంతరించిపోయే స్థితికి వచ్చింది. అంతరించిపోయే పక్షుల జాబితాలో పిచ్చుకలను కూడా చేర్చాల్సి వస్తోంది. 

జీవ వైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి.  

ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.

విశేషమేమిటంటే.. మన దేశంలో ఆదివాసులు(గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం,అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


సృష్టిలో జీవరాశుల ఏకత్వం

ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్దతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగితా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది, ఏ ఒక్క జీవి అంతరించినా, మానవమనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాసులు అంతరించిపోతున్నాయి.


ప్రకృతి హితంగా భారతీయ ఆచారాలు
భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతిహితంగానే ఉంటుది. వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్, బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ వంటిది అని భావించి విషపు రసాయన ఎరువులతో నింపడు. కేవలం ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు. వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్ళు పెట్టకపోయినా, మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది, వచ్చినదాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెల్లివిరుస్తుంది. రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవవైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన, స్వచ్చమైన భారతీయ వ్యవసాయపద్ధతి. ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రిజ్‌లో పెట్టకపోయిన వాడిపోవు, భూమి కొన్ని ఏళ్ళ తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది.

భూ కాలుష్యం

రసాయనిక ఎరువులను వాడి, భూమిని, జీవాలను చంపి, ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే దిక్కుమాలిన పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయాలు, బీటీ, హైబ్రిడ్ విత్తనాలు, అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతుల ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజవిత్తనాలను గిరిజనులు ఇప్పటికి రక్షించుకుంటూ వస్తున్నారు, ఏడాదికొకసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధేయ్యంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశానం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగితా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవవైవిధ్య నిర్మూలన జరుగుతోంది.
కాపాడుకొనే విధానం

మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
నేపధ్యం

·                 2013 - నీరు మరియు జీవ వైవిద్యం

·                 2012 - సముద్ర జీవ వైవిద్యం

·                 2011 - అటవీ జీవవైవిద్యం.

·                 2010 - జీవ వైవిద్యం, అభివృద్ధి మరియు పేదరికం నియంత్రణ

·                 2009 - బలమైన విదేశీ జాతులు (Invasive Alien Species)

·                 2008 - జీవ వైవిద్యం మరియు వ్యవసాయం.

·                 2007 - జీవ వైవిద్యం అంరియు వాతావరణ మార్పు

·                 2006 - డై లాండ్స్ లో జీవ వైవిద్యాన్ని రక్షించుట

·                 2005 - Biodiversity: Life Insurance for our Changing World

·                 2004 - Biodiversity: Food, Water and Health for All

·                 2003 - Biodiversity and poverty alleviation - challenges for sustainable development

·                 2002 - Dedicated to forest biodiversity

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.