తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 28 May 2015

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- ముహూర్త నిశ్చయం, "స్నాతకం"

www.onenandyala.com

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- ముహూర్త నిశ్చయం, "స్నాతకం"

ముహూర్త నిశ్చయం
వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు. నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.
"స్నాతకం"

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. "సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ. స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.