www.onenandyala.com https://www.facebook.com/onenandyal
హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- (1)
"వివాహం"
ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం
చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం
ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల
సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల
కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత
ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై,
సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని
గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" -
"పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి,
భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి
వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.
పెళ్ళి చూపులు
పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు
చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి,
కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది
పలుకుతారు. "పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు
బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు.
వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో
సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు
చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ
బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు,
లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక,
నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.
సాంప్రదాయ పద్ధతుల గురించి చక్కగా చెప్పారు
ReplyDelete