తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 24 August 2023

శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...

 తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది.
క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.

                శ్రీవారి ఆలయంలో మొత్తం #మూడు 3️⃣🔄 ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి.

                శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు రాజులు, రాణులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి. ఆలయంలోని నిర్మాణాలను ఒకసారి పరిశీలిద్దాం.

1️⃣వ ప్రాకారం :-
〰️〰️〰️〰️〰️〰️

⛩️ మహాద్వార గోపురం ⛩️ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .....ప్రధాన ప్రవేశద్వార.... గోపురమే మహాద్వార గోపురం.⛩️

 పడికావలి,
సింహద్వారం,
ముఖద్వారం
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి.
దీనినే తమిళంలో..... ”పెరియ తిరువాశల్‌”... అని కూడా అంటారు. అనగా #పెద్దవాకిలి అని అర్థం.

                ఈ ప్రధాన ద్వారగోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపు కు గల రంధ్రాల  ద్వారా వచ్చే నీటితో కాళ్ళు కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఇక్కడే

కుడిగోడపై #అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం ⛏️ వ్రేలాడదీయబడి ఉంటుంది.

✡️ సంపంగి ప్రాకారం ✡️ :-

                మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి(వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం #సంపంగి. 🌷 ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.

                ఈ ప్రాకారంలో అద్దాలమండపం,
రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభమండపం, శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం,
ఉగ్రాణం,
విరజానది,
పడిపోటు,
వగపడి అర

తదితర మండపాలున్నాయి.

🏫 #కృష్ణరాయమండపం

                మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయమండపం. దీనినే #ప్రతిమామండపం అని కూడా అంటారు.
లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు.
అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.

⚛️ రంగనాయక మండపం ⚛️ :-

                కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు.
అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.

                రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతోపాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

✡️ తిరుమలరాయ మండపం ✡️ :-

                రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే తిరుమలరాయ మండపం.
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించగా,(సాళ్వ నరసింహ మండపం) ఆ తర్వాతికాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
ఈ మండపాన్ని ..…అణ్ణాఊయల మండపం..... అని అంటారు. అణ్ణై అనగా #హంస.🕊️ బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

 ☸️ అద్దాల మండపం – అయినామహల్‌ ☸️ :-

                ప్రతిమా మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం. దీన్నే అయినామహల్‌ అని కూడా అంటారు. అయినా అనేది హిందీ పదం. తమిళంలో కన్నాడి అరై అంటారు.

 ⬆️ ధ్వజస్తంభ మండపం ⬆️:-

                ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు.

                ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎత్తైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని(అన్నాన్ని 🍙🍚) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

2️⃣ 2వ ప్రాకారం :-
〰️〰️〰️〰️〰️〰️

....వెండి వాకిలి – నడిమి పడికావలి...

                ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామివారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు.
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న 🎲 శిల్పం ఉంది.

✡️ వసంత మండపం ✡️

                తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది.

🏕️ శ్రీ వరదరాజస్వామి ఆలయం 🏕️ :-

                విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో(సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామివారి శిలామూర్తి 🕴️ ప్రతిష్ఠింపబడింది.

🍱 🍨 ప్రధాన వంటశాల (పోటు) 🍱🍨

                విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

🏟️ కళ్యాణ మండపం 🏟️ :-

                సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటుచేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామివారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.

🐘🐎 వాహనం స్టోర్స్. 🐘 🐎 :-

ఉత్సవాలలో ఉపయోగించే గరుడ , సింహ ,  సూర్య , చంద్రాది వాహనాలు ఉంచే ప్రదేశం.

📚 సంకీర్తన భండారం 📚 :-

                సభ అరను అనుకుని ఉన్నదే సంకీర్తన భండారం. దీన్నే ”🗂️ .....తాళ్లపాక అర”, ”రాగిరేకుల అర”...... 🗂️  అంటారు. తాళ్లపాక కవులు సంకీర్తనలు చెక్కిన రాగిరేకులు ఈ అరలో భద్రపరిచి ఉండేవి.
ఈ భాండారంపై తాళ్లపాక అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలయ్యల శిల్పమూర్తులు మలచబడివున్నాయి.

🏟️ బంగారు బావి 🏟️ :-

                విమాన ప్రదక్షిణంలో పోటుకు వెళ్లే మార్గం పక్కన బంగారు బావి ఉంది. ఈ బావి ఒఱకు బంగారు రేకు తాపబడినందువల్ల ‘బంగారుబావి’ అని పిలువబడుతున్నది. శ్రీవారి వంటలకు, శుక్రవారాభిషేకానికి, నిత్యార్చనలకు ఈ బంగారుబావి జలాన్నే ఉపయోగిస్తారు. #రంగదాసు(తొండమానుని పూర్వజన్మ) అనే భక్తుడు ఈ బంగారు బావిని నిర్మించాడట.

🏕️ రామానుజ ఆలయం – భాష్యకార్ల సన్నిధి 🏕️ :-

                సంకీర్తన భాండారానికి పక్కగా, హుండీకి ఎదురుగా సన్నిధి భాష్యకారులు ఉన్నారు. భగ్రవద్రామానుజుల వారినే భాష్యకారులంటారు. శ్రీవారి సన్నిధిలో ఉండడం వల్ల ”సన్నిధి భాష్యకారుల’ని ప్రసిద్ధి ఏర్పడింది. తిరుమల క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దిన ఘనత #శ్రీరామానుజులవారిదే.

 🛐 శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి 🛐 :-

                శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం.  క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. ‘అళగియ సింగర్‌'(అందమైన సింహం) అని, వేంకటాత్తరి(వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది.

 🦅 గరుడ సన్నిధి 🦅 :-

మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా  గరుడాళ్వారులు గారు ఉన్న మండపం.
బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా ఇటీవలే బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

✡️ తిరుమామణి మండపం ✡️ :-

బంగారు వాకిలి కి గరుడ సన్నిధి కి మధ్యగల ప్రదేశం.

సుప్రభాత సేవ లో భక్తులను ఇక్కడే ఉంచుతారు.

🔔 ఘంట:- 🔔

పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు.

ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

🕴️ద్వారపాలకులు 🕴️ :-

బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.

3️⃣ మూడవ ప్రాకారం:-
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
 ⛩️ బంగారువాకిలి ⛩️ :-

                శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామివారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.

⚛️ స్నపనమండపం ⚛️:-

                బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ.614లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌ కోయిల్‌ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

✡️ రాములవారి మేడ ✡️ :-

                స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించే నడవ ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

🛌 శయనమండపం 🛌 :-

                రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

 ➖➖ కులశేఖరపడి ➖➖ :-

 శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

🏛️ గర్భగృహం 🏛️ :-

                కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ”ఆనంద నిలయం” అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

*శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) 🚹 :-

                గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”....స్థానకమూర్తి....” అంటారు.
 అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”....ధ్రువమూర్తి....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.

                శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల #స్వయంభూమూర్తి.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.