తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 31 March 2011

మీరు కూడా మీ చిన్నప్పుడు మీ వేసవి సెలవులు ఇలాగే గడిపారా?...


నా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళేవాళ్ళం. నాకు చాలా బాగా గుర్తు. మిద్దె మీద పడుకునే వాళ్ళం. మా ఇంటి చుట్టూ జామచెట్లు, కొబ్బరిచెట్లు, ఇంటి ముందర బాగా అల్లుకున్న సన్నజాజి తీగె ఉండేవి. ఉదయాన్నే నిద్ర లేచేసరికి, పక్షుల కిలకిలా రావాల తో చల్లగా వీచే గాలి లో విరిసీ విరియని సన్నజాజుల పరిమళాలు ఏవో మధురలోకాలలోకి తీసుకెళ్ళేవి. పొద్దున గ్లాసుడు పాలు తాగి, ఇడ్లీ నో, చద్దన్నమో తిని తాతయ్య తో పాటు తోటకు వెళ్ళే వాళ్ళం. అక్కడ మామిడిచెట్లకు ఉయ్యాలలు కట్టుకుని ఊగి ఆడుకుని, మామిడిపళ్ళు, తాటిముంజెలు తిని వచ్చేసేవాళ్ళం. నందివర్దనం చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వేళ కి పక్షులన్నీ గూటికి చేరుకునేవి. సరిగ్గా అదే సమయానికి మా ఊరి సినిమా హాల్ లో "నమో వెంకటేశా, నమో తిరుమలేశా" అనే పాట రికార్డ్ వేసేవాళ్ళు. ఆ సాయం సంధ్య వేళ పిచ్చుకల కిలకిలలు, పావురాళ్ళ కువకువలు, దూరంగా గుడిలో నుండి వినబడుతున్న ఘంటసాల పాడిన భక్తి పాటలు వినడం నాకు చాలా చాలా ఇష్టం.  సాయంత్రం పూట స్నానం చేసి,  అమ్మమ్మ తో శివాలయానికి వెళ్ళేవాడిని. రాత్రి భోంచేసాక మిద్దె మీద పక్కలు వేసేవాళ్ళు. ఆ చల్లని రాత్రుల్లో అమ్మమ్మ ఒడిలో పడుకుని చెప్పే రాజుల కధలు వింటూ, ఆకాశంలోని చందమామ ను, నక్షత్రాలను చూస్తూ మెల్లగా నిద్ర లోకి జారుకునేవాడిని....


అలా నా చిన్నపుడు చాలా మధురంగా గడిచింది.


ఇప్పుడు కాలం మారిపోయింది. బహుశా ఇప్పటి పిల్లలకు అంత తీరిక లేదనుకుంటా. ఆటలు లేవు పాటలు లేవు. ఎంట్రన్స్ టెస్ట్ లకు ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతూ విలువైన బాల్యాన్ని కోల్పోతున్నారనిపిస్తుంది. కిలోల కొద్దీ బాగ్ లు, ఊపిరి సలపనివ్వని హోమ్‍వర్క్ లు, ట్యూషన్ లు, బిజీబిజీ లైఫ్ లు, వాళ్ళ చిన్న అందమైన మనసుల్ని ఈ వయసులోనే కలుషితం చేయడానికి రకరకాల ప్రోగ్రామ్ లతో ఎప్పుడు కవ్వించే మాజిక్ పెట్టె (టి.వి.) ... ఇక వాళ్ళకి కధలు వినే టైమ్ ఎక్కడ పాపం.....

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.