www.onenandyala.com
హిందూ సాంప్రదాయ వివాహ వేడుక - గంపలో వధువు-కాళ్లు కడగడం
హిందూ సాంప్రదాయ వివాహ వేడుక - గంపలో వధువు-కాళ్లు కడగడం
గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు. వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.
అలా గంపలో ఎందుకు తెస్తారండీ..పిల్లలు అడిగినప్పుడు చెప్పడానికి నాకూ తెలియదు. అప్పుడెప్పుడో బాల్య వివాహాలప్పుడు పిల్లని బుట్టలో పెట్టి తెచ్చేవారు అదే సాంప్రదాయమైంది అని ఎవరో చెప్పారు. ఇంకేమైనా కారణం ఉంటే వివరించగలరు.
ReplyDeleteవివాహవేడుకలో పెళ్ళికొడుకును విష్ణుమూర్తిగాను, పెళ్ళికూతురును లక్ష్మీదేవి గాను భావిస్తారు. పెళ్ళికూతురు గౌరీపూజ చేసినతరువాత ఆమెను లక్ష్మీదేవిగా భావించి ఆమె మేనమామలు వెదురుబుట్టలో మోసుకువస్తారు. పూజ తరువాత లక్ష్మీదేవి నేలపై నడకూడదని భావి అలా మోసుకువస్తారు. ఇంకొక ప్రాచీన కారణం: పాతకాలంలో నేల గరుకుగా, రాళ్ళు గుచ్చుకునేలా ఉండడం వల్ల, పెళ్ళికూతురు గాయపడకుండా ఉండడానికి, గౌరి పూజ తరువాత ఆమెను అలా గంపలో తీసుకువస్తారని వ్యవహారంలో ఉంది.
Delete