తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday 13 June 2015

పీఆర్‌సీ ప్రయోజనాలపై 3 జీవోలు జారీ

పీఆర్‌సీ ప్రయోజనాలపై 3 జీవోలు జారీ

ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌, స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లకు ఓకే
అదనపు పింఛను మంజూరుపైనా జీవో
-హైదరాబాద్‌

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. 10వ పీఆర్‌సీ ప్రయోజనాలతో ముడిపడిన ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం, స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లు, పింఛనుదారులకు అదనపు పింఛను మంజూరులకు సంబంధించిన మూడు జీవోలను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప శుక్రవారం రాత్రి జారీ చేశారు. 10వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకే ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంను అమలుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ఎలాంటి మార్పులూ చేయడం లేదని పేర్కొంది. ఒకే కేడర్‌లో పనిచేస్తూ వెళ్లిన వారికి 6, 12, 18, 24 ఏళ్లకు ఆటోమేటిక్‌గా ఇంక్రిమెంటు వర్తిస్తుంది. అలాగే 2015 నాటికి సవరించిన వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులందరికీ అయిదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. వేతన స్థిరీకరణ, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం, పింఛన్‌, పదోన్నతుల్లాంటి అవసరాల కోసం ఈ స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లను సాధారణ ఇంక్రిమెంట్లుగానే పరిగణించనున్నట్లు తెలిపింది. అలాగే వేతన సవరణకు అనుగుణంగా పింఛనుదారులు, కుటుంబ పింఛనుదార్లకు అదనపు పింఛన్లు మంజూరు చేస్తూ జీవో జారీచేశారు. 2010 వేతన శ్రేణి కింద పింఛన్లు తీసుకుంటున్న అందరికీ ఈ అదనపు పింఛన్ల ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఏజీ, రాష్ట్ర ఆడిట్‌ డైరెక్టర్‌ నుంచి ఎలాంటి అధీకృత ఉత్తర్వులు అవసరం లేకుండానే పింఛను పంపిణీ అధికారులు ఇందుకుతగ్గ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అన్నీ విడుదల చేస్తాం: యనమల
పీఆర్‌సీ అమలుకు సంబంధించిన అన్ని విషయాలనూ అమలుచేస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచే కొత్త వేతన సవరణ అమలు చేయాలని, కొత్త వేతనాల జారీలో ఎదురవుతున్న అన్నిరకాల ఇబ్బందులను తొలగించాలని అధికారులకు తగిన ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ వేతన స్థిరీకరణ ప్రక్రియ అంతా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరుగుతున్నట్లు తెలిపారు. డీడీఓలు నిర్ధారించిన ఉద్యోగుల జీతభత్యాలు, బకాయిలను త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇంకా ఎక్కడైనా ఉద్యోగుల వివరాల్లో తప్పులు దొర్లిఉంటే వాటిని సరిదిద్ది సాధ్యమైనంత త్వరగా మళ్లీ సమర్పించాలని డీడీఓలను ఆదేశించినట్లు వెల్లడించారు. డీడీఓలంతా తమ ఆధీనంలో ఉన్న ఉద్యోగుల వివరాలను వేగవంతంగా నమోదు చేయాలని ఆదేశించామన్నారు. దీనివల్ల తక్షణం కొత్త వేతనాలు జారీ చేయడానికి వీలవుతుందని చెప్పారు.

Download Here ::  www.onenandyala.com

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.