తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday 9 June 2015

భారతీయ అద్భుతాలు - ఛాయా సోమేశ్వరాలయం

www.onenandyala.com

భారతీయ అద్భుతాలు - ఛాయా సోమేశ్వరాలయం

ఛాయా సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోళులు (నల్లగొండ/నీలగిరి చోళులు) పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్బుతం. ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్బగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్దానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్బగుడిలో కూడా నీరు ఉబికి రావడం. చెరువు ఎండితే గర్బగుడిలో నీరు కూడా ఎండిపోతుంది. ఇటీవలికాలంలో చెరువులో రోజూ నీరు ఉండేలా అభివృధ్ది చేసిన అనంతరం గర్భగుడిలోకి నీరు రాకుండా సిమెంట్ వేశారు.

 ఇక ముఖ్యమైన విషయానికి వస్తే దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ. గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్ధానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్ధానాన్ని మార్చుకోదు అనేది ఇప్పటివరకూ ఎవరికీ అంతుచిక్కని విషయం. శ్రీ చాయా సోమేశ్వరాలయం నల్లగొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు అనే గ్రామంలో క్రీ.శ.11 మరియు 12 శతాబ్దకాలంలో కుందూరు చోళులు నిర్మించినట్లుగా మనకు ఆర్కియాలజీ మరియు మ్యూజియం విభాగం వారి వివరాలను బట్టి తెలుస్తుంది.

 ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. ఈ ఆలయానికి పడమర ఉన్నటువంటి గర్భగుడిలో శిలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చల ఛాయ, సూర్యుని స్థానముతో సంబంధం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పడడం ఈ ఆలయం సంతరించుకున్నటువంటి అద్భుతం. ఆ నీడ ఏ వస్తువుది అన్న విషయము కూడా ఇంతవరకూ అంతు చిక్కలేదు. అలనాటి నిర్మాణకౌశలం, శిల్ప నైపుణ్యం మరియు శాస్త్ర సిద్ధాంతాల మేళవింపుకు ప్రతీకగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు.


 ఆలయ మధ్యభాగంలో చతురాశ్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే, తూర్పు, పడమర, ఉత్తరాన మూడు గర్భగుడులు కలిగి ఉంది. అయితే మూడు గర్భగుడులు కూడా ఒకేరీతిగా మరియు నిర్మాణశైలి కలిగి ఉన్నప్పటికీ కేవలం పడమటి గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయను తిలకించగలము. వాస్తవానికి ఆలయ శిల్పి వాస్తవ నమూనా మొదట నాలుగు గదులను కలిగి వుంది.  అంటే దక్షిణంలో కూడా గది వుంది. ఈ నమూనా ప్రకారం కాంతి అంతరాలయంలోకి ప్రవేశించే క్రమంలో ప్రతిగది కూడా దాని ఎదురుగా ఉన్న గదిలో ఏకఛాయ ఏర్పడటానికి కారణభూతమయ్యే విధంగా పథకం రచించబడింది. మనము నాలుగు గదులలోనూ ఏకఛాయను వీక్షించే అవకాశము ఏర్పడేది. అయితే అతను నీడలను ఏర్పరచడానికి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణము చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం జరిగింది.

అలాంటి పరిస్థితిలో సూర్యుని స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయ శిల్పి ఉద్దేశ్యము ప్రకారం ఛాయ నిశ్చలంగా ఉండాలంటే తూర్పు లేదా పడమర ఛాయలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని కలిపే తలము, తూర్పు నుండి పడమరకు సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉంటుంది. అదే విధంగా ఉత్తర మరియు దక్షిణఛాయలను కలిపే తలము, లంబంగా ఉండటం కారణంగా ఆ ఛాయలు సూర్యుడు ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో కదులుతాయి. తూర్పునకు అభిముఖంగా ఉంటుంది. కాబట్టి పడమర గర్భగుడిలో నీడను అలాగే ఉంచి, పడమర నుంచి కాంతిలోపలికి ప్రవేశించకుండా దేవతా విగ్రహాలను ఉంచి తూర్పు గర్భగుడిలో నీడకు ప్రాముఖ్యతను తగ్గించాడు. ఆలయానికి దక్షిణంగా ద్వారాన్ని ఏర్పరచి దక్షిణ మరియు ఉత్తర ఛాయలను తొలగించాడు. సూక్ష్మంగా వివరించాలంటే, పడమటి గర్భగుడి ముందు ఉన్నటువంటి కీలక నాలుగు స్తంభాల నీడలు కలిసి ఏకఛాయలాగ ఏర్పడతాయి. ఈ ఛాయను మనము వెన్నెలకాంతిలో కూడా వీక్షించవచ్చు. ఏక నిశ్చల ఛాయ ఏర్పాటులో అయిదు ప్రధానాంశాలు కీలకపాత్ర పోషిస్తాయి అవి ....

1 స్తంభాల మధ్య దూరం
2 స్తంభాల నుండి గర్భగుడి వెనుక గోడ దూరం
3 స్తంభాల నుండి కాంతిలోనికి ప్రవేశించే మార్గాల దూరం
4 కాంతి జనకం (సూర్యుడు) ప్రయాణించే దిశ
5 స్తంభాలతో కాంతి జనకాల స్థానం చేసే కోణం.

 ఆలయానికి రాళ్ళతో కూడిన పునాదిని ఎంచుకోవడం ద్వారా శిల్పి భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాస్తవానికి పూర్వం గ్రామాలలో, పట్టణాలలో వివిధ కార్యాలకు అంటే వివాహాలకు, కచేరి, పండుగలు, మతకృత్యాలు మొదలైన వాటికి ఆలయాలే కేంద్రంగా ఉండేవి. కాబట్టి రాజులు వాటికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి నిర్మించేవారు. ఆలయాలకు భక్తులను రప్పించడానికి శిల్పులు ఏదో ఒక ప్రత్యేకతతో ఆలయాలను నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి నిశ్చలఛాయను అనుసంధానించారు. అది శిల్ప చాతుర్యమైనా, నిర్మాణ అద్భుతమైనా కూడా దైవత్వమే. ప్రజలకు దైవభక్తి, మతాచారాల పట్ల ఉండే విశ్వాసాలను ఆసరాగా తీసుకుని  శాస్త్రమనే కాషాయపు గుళికను సాంప్రదాయము అనే చెక్కరలో అద్ది మానవాళికి అందించడం జరిగింది.  శాస్త్రము, ఆధ్యాత్మికత రెండు కూడా రైలుపట్టాల లాంటివి ఎందుకంటే అవి ఎప్పుడూ కలవవు కాని ఒకటి లేకుండా మరొకదానికి ప్రాధాన్యత లేదు.
ఆత్మే పరమాత్మ ... దేవుని నమ్మని వారు తమని తాము నమ్మలేరు. శాస్త్రీయ దృక్పథానికి ఆధ్యాత్మికతను అద్ది భారతీయ సంప్రదాయాలను, సంస్కృతులను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం మనందరిమీద ఉంది.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.