ప్రియతమా నీవెక్కడ...?...... పార్ట్ 1
"ప్రేమ...."
ఈ రెండక్షరాలే రెండు హృదయాల కలయికతో ముడిపడిన రెండు జీవితాలు కడదాకా సాగించే ప్రయాణానికి ఆధారం.
ప్రతి స్త్రీ తనకు కాబోయే భర్త తనకు మంచిస్నేహితుడవ్వాలని కోరుకుంటుంది. అలాగే, ప్రతి యువకుడు కూడా తనకు కాబోయే అమ్మాయి గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని కలిగిఉంటాడు. భార్య మనసును అర్ధం చేసుకోలేని మగవాడు మంచిభర్త కాలేడు. పురుషుడి హృదయం స్త్రీలా మెత్తనైనది. స్త్రీ హృదయం పురుషుడిలా కఠినమైనది అని ఓ మహానుభావుడు చెప్పాడు...."
అతని ప్రసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది.
"పదండి వెళ్లిపోదాం" అంది చందన.
స్పీచ్ బానే ఉంది గా. అప్పుడే వెళ్ళిపోదామంటున్నావేం. మీ అమ్మాయిల మనసులు కఠినంగా ఉంటాయి అనేసరికి కోపం వచ్చిందా... నవ్వుతూ అడిగాడు కుమార్.
అదేం లేదండీ అంది చందన.
వాళ్ళిద్దరు భార్యాభర్తలు. కుమార్ సాఫ్ట్‍వేర్ ఇంజనీర్. చందన "మాధవి కాన్సర్ ట్రస్ట్" కి ఛైర్మన్.
ఆ చర్చ జరిగుతున్న ఆడిటోరియం నుండి బయటికి వచ్చి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ పార్క్ వైపు నడిచారు.
చందనా! అటు చూడు. జైలు నుండి పారిపోయి వచ్చినట్లున్నాడు కదూ. బహుశా టెర్రరిస్టేమో నవ్వుతూ అన్నాడు కుమార్. భర్త మాటలకు యధాలాపంగా అటుకేసి చూసింది చందన. మాసిన బట్టలు, తైలసంస్కారం లేక రేగిన జుట్టు, అసహ్యంగా కనిపిస్తున్న గడ్డంతో భయంకరంగా ఉన్నాడతను. అతన్ని చూసి ఒక్క క్షణం షాక్ కి గురై వెంటనే తేరుకుని, "కార్తీక్" అని గట్టిగా కేక పెట్టి అతని వైపు పరిగెత్తింది.
కుమార్ కి ఏమీ అర్దం కాలేదు. అయోమయం గా ఆమెని అనుసరించాడు "ఏమైంది చందూ, ఏమైంది అంటూ"
కార్తీక్ ఎలా ఉన్నావు. ఎక్కడ ఉన్నావు. అసలు ఇన్ని రోజులు ఏమై పోయావు.. ఉబుకుతున్న కన్నీటిని అదుపుచేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఒక రకమైన ఉద్వేగంతో అడిగింది చందన.
విస్మయంగా వారిద్దరికేసే చూస్తున్నాడు కుమార్.
భావరహితంగా ఆమె వైపు చూసి నిర్లిప్తంగా నవ్వాడతను. కళ్ళు రెండూ లోపలికి పీక్కుపోయి నేడో రేపో పోయేలా ఉన్నాడతను.
నన్ను "మధు" దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళవా..? నెమ్మదిగా గొంతు పెగిల్చాడు కార్తీక్.
మధు దగ్గరికా..? ఆమె కంఠం రుద్దమైంది.
ప్లీజ్.. ఇదే చివరిసారి. నన్ను తీసుకెళ్ళు. అతని కంఠంలో ఆజ్ఞ లాంటి అభ్యర్దన ఉంది.
ఆమె కళ్ళల్లోంచి కన్నీరు ధారలు గా కారుతుండగా, గత్యంతరం లేక కుమార్ దగ్గరికొచ్చి "ఏమండీ మన కారు ఇక్కడికి తీసుకురండి" అని చెప్పింది.
అదికాదు చందనా, అతనెవరో ఏమో, నువ్విలా... అతనింకా ఏదో చెప్పబోతూంటే వారించి, ప్లీజ్ అండీ మీకు అంతా తర్వాత వివరంగా చెబుతాను. ముందు కారు తీసుకురండి అంది.
అన్యమస్కంగానే కారు తీసుకు వచ్చాడు. కార్తీక్ ని జాగ్రత్తగా కారు బాక్ సీట్ లో పడుకోబెట్టారు.
డ్రైవింగ్ సీట్ లో కూర్చుని చందనే డ్రైవింగ్ చెయ్యసాగింది.
"ఎక్కడికెళ్తున్నాం చందూ" అడిగాడు కుమార్.
ఆమె ఏదో దీర్ఝాలోచనలో ఉంది. కారు "హిందూ స్మశాన వాటిక" లోకి ప్రవేశించింది.
ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అడిగాడు కుమార్ ఒకింత అసహనంతో.
చెమర్చిన కళ్ళతో "మాధవి ఉండేది ఇక్కడే " చెప్పింది చందన. నిశ్చేష్టుడైపోయాడు కుమార్.
(ఇంకా ఉంది).....
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.