ఇంద్రవెల్లి గాయానికి మూడు దశాబ్దాలు
- అడవి బిడ్డల గుండెల్లో చెరగని ముద్ర
- అభివృద్ధికి ఆమడదూరంలో ఆదివాసీిలు
- మారని జీవన ప్రమాణాలు
- నేడు ఇంద్రవెల్లి మృతవీరుల సంస్మరణ దినం
ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలు రక్తం చిందించి మూడు దశాబ్దాలయ్యాయి. 1981 ఏప్రిల్ 20న తుడుంమోతకు తరలివచ్చిన ఆదివాసులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకీ తూటాలకు అడవి బిడ్డలు అమరులై ఈనెల 20వతేదీ బుధవారం నాటికి 30 ఏళ్లు గడిచాయి. అడవి బిడ్డలు చిందించిన రక్తం తడి ఇంకా ఆరనేలేదు. ఇంద్రవెల్లి పోరు అడవి బిడ్డల్లో పోరాటతత్వాన్ని పెంచింది. గతంలోకి ఒక్కసారి తొంగిచూస్తే ముప్ఫై ఏళ్ల క్రితం ఆదివాసులు బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్న రోజులు.. రెండు కాళ్ల ఆధునిక మృగాల తాకిడికి అడవి అడవంతా అల్లాడింది..
దళారులు.. వ్యాపారులు, అటవీ అధికారులు, పోలీసుల చేతిలో ఆదివాసుల బతుకులు దోపిడీ, పీడనకు గురయ్యాయి. అడవిలో ఆకుల దోపిడి.. అడవి సంపద దోపిడి.. ఆఖరికి అడవిలో వీచే గాలి సైతం దోపిడీనే.. అడవి బిడ్డలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. చిట్టడవులు చీకట్లో చిక్కి శల్యమయ్యాయి. అడవి ఒడిలో అభివృద్ధి అనేది కనుచూపులో కనబడలేదు. అక్కడంతా చీకటి. దళారుల దోపిడీ.. అక్కడ అమాయకులను బాదుతున్న పోలీసు లాఠీలు.. గిరిజనులు నోరు విప్పితే చాలు చావబాదే రోజులు.. అడవి బిడ్డలు ఆత్మరక్షణ కోసం నడుం బిగించక తప్పని పరిస్థితి. ఆ తరుణంలోనే అటవీ గ్రామాల్లో అన్నలు రంగ ప్రవేశం చేశారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదిరించారు. గిరిజనుల గుండెల్లో చోటుసంపాదించారు. గూడాల్లో స్థానం పొందారు.
ఫలితంగా గిరిజన గ్రామాల్లో బూట్ల చప్పుడు ప్రారంభమైంది. పోలీసుల అరాచకత్వాలకు బలవుతున్న గిరిజనులను అన్నలు తట్టిలేపారు. చైతన్యాన్ని రగిల్చారు. అడవి బిడ్డలు అన్నలతో జతకట్టారు. వారితో కలిసి తుడుం మోగించారు. అన్యాయాన్ని ఎదురించారు. తమకు జరుగుతున్న అన్యాయాలు పట్టిపీడిస్తున్న భూమి సమస్యను పరిష్కరించడం కోసం గిరిజనులు అన్నల సహాయంతో పథకాన్ని రూపొందించుకున్నారు. అన్నల అండతో అణగారిన జాతి అగ్గై లేచింది. అడవుల్లో ఖాళీగా ఉన్న భూములలో పోడుసాగు ప్రారంభించారు. అప్పుడే అడవుల్లో అలజడి మొదలైంది. తమ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు.
నక్సల్స్ అనుబంధ సంస్థ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న బహిరంగ సభ నిర్వహించడానికి గ్రామాల్లో తుడుం మోగించి ప్రచారం చేశారు. ఆనాడు 1981 ఏప్రిల్ 20న నాలుగు దిక్కుల నుంచి ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా ఆదివాసులు ఇంద్రవెల్లి చేరుకున్నారు. వేలాది మంది ఇంద్రవెల్లి చేరుకోవడంతో ఇంద్రవెల్లి జనసంద్రమైంది. గిరిజనులు ఇంద్రవెల్లికి రాకుండా పోలీసులు విఫలయత్నం చేశారు. జనాన్ని చూసి పోలీసు గుండెలు అదిరిపోయాయి. పోలీసుల చేతిలో తుపాకులు, గిరిజనుల చేతిలో ఆయుధాలు ''నువ్వా... నేనా'' అన్నట్లు ఉన్నాయి. ఆ రోజు ఇంద్రవెల్లి సంతకు వచ్చిన జనం మరోవైపు సభ కోసం వచ్చిన వేలాది మందితో ఇంద్రవెల్లి కిక్కిరిసిపోయింది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోయారు. సభాస్థలికి చేరుకోవడానికి ఊరేగింపు ప్రారంభమైంది. వేలాది మంది చేస్తున్న నినాదాలతో ఇంద్రవెల్లి దద్దరిల్లిపోయింది. అదే గుంపులో ఓ గిరిజన మహిళకు పోలీసుకీ మధ్య మాటామాటా పెరిగింది. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి పోలీసుల ఆయుధ ప్రయోగం చేసింది. పోలీసు నేలకొరిగాడు. పరిస్థితి అదుపు తప్పి కాల్పులకు దారితీసింది.
ఆదిలాబాద్ ఆర్డీఓ కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పోలీసులు కాల్పులు ప్రారంభించి పిట్టలను కాల్చినట్లు ఆదివాసులను కాల్చారు. కరుడుగట్టిన మేఘాలు తీర్చలేని ధరణి మాత దాహాన్ని గోండుల రక్తం తీర్చింది. అప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
అనధికార లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. పోలీసు కాల్పులకు కాళ్లు, చేతులు పోగొట్టుకున్న గిరిజనులెందరో నేటికి సజీవ సాక్ష్యంగా ఉన్నారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో మరణించిన గిరిజనుల స్మారకార్థం రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో స్థూపాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని డైనమైట్లతో పేల్చి నేలమట్టం చేశారు. స్థూపాన్ని కూల్చడంతో గిరిజనుల్లో నిరాశ నిస్పృహలు పెరిగాయి. అన్నలకు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే అల్లంపల్లి సంఘటన జరిగింది. గిరిజనుల్లో నెలకొని ఉన్న నిరాశను గమనించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్థూపాన్ని నిర్మించారు. అడవిబిడ్డలు చిందించిన రక్తపు మరకలు ఇంకా చెదిరిపోలేదు. అడవి తల్లి ఇంకా మౌనంగా రోదిస్తూనే ఉంది. ఇంద్రవెల్లి సంఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గిరిజనుల సంక్షేమానికి పాలకవర్గాలు పెద్దపీట వేశాయి. ఇంద్రవెల్లి సంఘటన గిరిజనుల్లో పోరాట తత్వాన్ని మరింత బలోపేతం చేసింది. అనేక పోరాటాలకు సన్నద్ధం చేసింది.
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రతియేటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఆనాడు అధోగతికి ఆనవాళ్లుగా ఉన్న గిరిజన గ్రామాల్లో కొంత అభివృధ్ధి కనిపించినా జీవన ప్రమాణాల్లో మార్పులు రాలేదు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కూడు కరువై.. బతుకు బరువై అడవి బిడ్డలు అల్లాడుతూనే ఉన్నారు. తాగునీరు, వైద్యం ఇంకా వారికి అందడం లేదు. ఊరూరూ చెట్టుకొకటి.. గుట్టకొకటి రక్షిత నీటి పథకాలు నిర్మించినా గిరిజనులకు చుక్కనీరు అందడం లేదు. కలుషిత నీరు ఆదివాసుల ప్రాణాలను హరించేస్తోంది. వైద్యం అందక యేటా వందలాది మంది మరణిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. గిరిజనుల వ్యవసాయం అటకెక్కింది. గిరిజనుల భూములకనుగుణంగా సాగునీటి వనరులు పెంపొందించడానికి నిర్మించిన చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. చెరువుల నిర్మాణంలో గిరిజనుల వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కంట్రాక్టర్ల ప్రయోజనాలను అధికారులు దృష్టిలో ఉంచుకొని నిర్మించడంతో చెరువుల నిండా నీరున్నా అవి చేలకందని పరిస్థితి నెలకొంది. పౌష్ఠికాహార లోపం కారణంగా రక్తహీనత ఏర్పడి జీవచ్ఛవాలుగా మారి రోగాల బారిన పడి ఆదివాసులు అడవిసాక్షిగా ప్రాణాలు విడుస్తున్నారు.
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రతియేటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఆనాడు అధోగతికి ఆనవాళ్లుగా ఉన్న గిరిజన గ్రామాల్లో కొంత అభివృధ్ధి కనిపించినా జీవన ప్రమాణాల్లో మార్పులు రాలేదు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కూడు కరువై.. బతుకు బరువై అడవి బిడ్డలు అల్లాడుతూనే ఉన్నారు. తాగునీరు, వైద్యం ఇంకా వారికి అందడం లేదు. ఊరూరూ చెట్టుకొకటి.. గుట్టకొకటి రక్షిత నీటి పథకాలు నిర్మించినా గిరిజనులకు చుక్కనీరు అందడం లేదు. కలుషిత నీరు ఆదివాసుల ప్రాణాలను హరించేస్తోంది. వైద్యం అందక యేటా వందలాది మంది మరణిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. గిరిజనుల వ్యవసాయం అటకెక్కింది. గిరిజనుల భూములకనుగుణంగా సాగునీటి వనరులు పెంపొందించడానికి నిర్మించిన చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. చెరువుల నిర్మాణంలో గిరిజనుల వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కంట్రాక్టర్ల ప్రయోజనాలను అధికారులు దృష్టిలో ఉంచుకొని నిర్మించడంతో చెరువుల నిండా నీరున్నా అవి చేలకందని పరిస్థితి నెలకొంది. పౌష్ఠికాహార లోపం కారణంగా రక్తహీనత ఏర్పడి జీవచ్ఛవాలుగా మారి రోగాల బారిన పడి ఆదివాసులు అడవిసాక్షిగా ప్రాణాలు విడుస్తున్నారు.
గిరిజన మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాయకష్టం చేసే ఆదివాసి మహిళలు రక్తహీనతతో చావుకు చేరువవుతున్నారు. గిరిజనుల జీవన విధానం ఇలా ఉంటే ముప్పై ఏళ్లక్రితం గిరిజనుల్లో ఉన్న చైతన్యం ఇప్పుడు అనేకరెట్లు పేరిగింది. పోరాట మనస్తత్వం గల ఆదివాసులలో సామాజిక చైతన్యం స్పష్టంగా కనబడుతోంది. రోడ్డు సైడు గ్రామాల పరిస్థితిని చూసి గిరిజనులు అభివృద్ధి చెందారంటే పప్పులో కాలేసినట్లే. మారుమూల గ్రామాల్లో గిరిజనుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. అటవీ హక్కుల చట్టంతో అటవీ భూములు గిరిజనుల హస్తగతం కావడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. అటవీ భూములపై హక్కులు రావడం గిరిజనుల త్యాగఫలితమేనని ఆదివాసులు నమ్ముతున్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు భారీగానే కృషి జరుగుతున్నప్పటికీ ఉన్నత చదువులకు ఆదివాసీ యువతీ యువకులు ఇంకా దూరంగానే ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పడం వల్ల గిరిజన బాలబాలికలు చదువుపై ఆసక్తి కనబరుస్తుండటంతో ఇప్పుడిప్పుడే ఆదివాసీ యువతీ యువకుల్లో సామాజిక చైతన్యం పెల్లుబుకుతోంది. ఆశ్రమ పాఠశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటుచేయడంతో గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. వైద్యారంగం ఇంతవరకు మెరుగుపడలేదు. సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ గిరిజనులకు సకాలంలో మందులు దొరకడం లేదు. ఇప్పటి మారుమూల ప్రజల గ్రామాల్లో సంవత్సరాంతం వ్యాధులు అడవిబిడ్డలను వేధిస్తూనే ఉన్నాయి. గిరిజనులను అభివృద్ధి పరిచేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నా ఇంకా దోపిడీ, పీడన కొనసాగుతూనే ఉన్నాయి. అమాయక గిరిజనులు ఇంకా దోపిడీకి గురవుతూనే ఉన్నారు.
ఇంద్రవెల్లి క్షతగాత్రుల దీనగాథలు
ఇంద్రవెల్లి మారణహోమం జరిగి మూడు దశాబ్దాలు గడిచినా ఆ గాయం ఇంకా మానలేదు. ఇంద్రవెల్లి కాల్పుల్లో క్షతగాత్రులైన వారి బతుకులు నేటికీ దుర్భరంగానే ఉన్నాయి. పోలీసుల తూటాలకు బలైన వారి కుటుంబాలకు ఇప్పటికీ ఎలాంటి సహాయం అందకపోగా క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇంద్రవెల్లి క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినా దాన్ని అమలు చేయలేదు. అడవి బిడ్డల త్యాగాలు వృథా పోవని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని బాసలు చేసిన వారు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు.
ఇంద్రవెల్లి కాల్పుల్లో పోలీసు తూటాకు గాయపడ్డ కినక మాన్కుబాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. ఇంద్రవెల్లి కాల్పుల్లో గాయపడ్డ భీంరావు పోలీసు తూటాలకు కాలు పోగొట్టుకుని భయకంపితుడై స్వగ్రామం విడిచిపెట్టి ఉట్నూర్‌కు సమీపంలోని వంకతుమ్మ గ్రామంలో నివసిస్తున్నాడు. మడావి జంగుబాయి, ఆమె భర్త శంభు ఇంద్రవెల్లి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నారు.
వైద్యమందక మడావి జంగుబాయి, భర్త శంభు అనంతలోకాలకు వెళ్లిపోయిన సంఘటన ఇప్పటికీ గిరిజనుల హృదయాలను కలిచివేస్తోంది. భర్త చనిపోయిన తరువాత ఆమె బతుకుదెరువు కోసం కన్నాపూర్ గ్రామానికి వెళ్లిపోయింది. అడవే ఆధారంగా జీవిస్తోంది. హెర్మ దేవరావు అనే గిరిజనుడు భుజానికి తూటా తగలడంతో వైద్యమందక మరణించగా ఆయన భార్య మానుబాయి, కొడుకు లింగుతో కలిసి దేశాంతరాలు వెళ్లిపోయింది. ఏప్రిల్ వచ్చిందంటే క్షతగాత్రుల కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలు ఆనాటి సంఘటనను జ్ఞాపకం తెచ్చుకొని కన్నీరు తెచ్చుకోవడం తప్ప వారికి మరే మార్గం లేదు. ఇంద్రవెల్లి మండలంలోని ఓల్‌మద్రి గ్రామానికి చెందిన సెడ్మకి కొద్దు ఇంద్రవెల్లి కాల్పుల్లో అసువులు బాయగా ఆయన కుటుంబం దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. ఆయన కొడుకు మహంతిరావు, భార్య లక్ష్మీబాయి కోయల్‌పాండ్రి, తాటిగూడ గ్రామాల్లో నివసిస్తున్నారు.
ఇంద్రవెల్లి సంఘటనలో అమరులైన త్యాగజీవులందరికి.... నా సుమాంజలి..
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.