తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 21 April 2011

రెండు భారత్‌లు ఉండరాదు !


దేశంలో ఆకలి చావులు సంభవిస్తుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. 'మీకు రెండు భారత్‌లు ఉండబోవు. పౌష్టికాహార లోపం నిర్మూలనకు సంబంధించి మన మొత్తం వైఖరిలో ఈ మొరటు వైరుధ్యాలేమిటి? దేశంలో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అంతం చేయాలి' అని దల్వీర్‌ భండారీ, దీపక్‌ వర్మతో కూడిన అత్యున్నత ధర్మాసనం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ పరాశరన్‌కు సూచించింది. 'ఓవైపు సంపన్నులు, మరోవైపు ఆకలి చావులు' ఒకే దేశంలో ఈ అంతరాలు ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'మన దేశం సంపన్నంగా మారుతోందని మీరే అంటున్నారు. అదే సమయంలో దేశంలో ఆకలి చావులూ సంభవిస్తున్నాయి. ఏమిటీ వైరుధ్యం?' అని ప్రశ్నించింది. దేశంలో మిగులు ఆహార ధాన్యాలున్నాయని చెబుతున్న సమయంలోనే ఆకలి చావులూ సంభవిస్తుండటంపై వ్యాఖ్యానిస్తూ 'ధనిక - పేద అని దేశాన్ని రెండుగా విభజించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. పేదరికాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న అర్హతా ప్రమాణాలను న్యాయమూర్తులు తప్పుబట్టారు. 'దేశంలో పంటలు బాగా పండాయని, గోదాములు పూర్తి నిల్వలతో వున్నాయని వింటున్నాం. ఇది సంతోషకరమైన పరిస్థితి అనడంలో సందేహం లేదు. అయితే ప్రజలకు ప్రయోజనం కలిగించని ఈ అంశాలతో ఉపయోగం ఏమిటి? ఓ వైపు గోదాములు సమృద్ధిగా ఉండగా, మరోవైపు ప్రజలు ఆకలితో మాడుతు న్నారు' అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రణాళికా సంఘాన్ని ఉద్ధేశించి 'పోషకాహార లోపం క్రమంగా పెరుగుతోంది. మీరేమో దేశంలో 36 శాతం మంది మాత్రమే పేదరిక రేఖకు దిగువన వున్నారంటున్నారు. 2011లో కూడా మీరు 1991 నాటి లెక్కలనే అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలే ప్రణాళికా సంఘం లెక్కలతో విభేదిస్తూ అఫిడవిట్లు సమర్పిస్తున్నాయి. పేదలు ఎక్కువగా వున్నారని, తాము ప్రణాళికా సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని రాష్ట్రాలు చెబుతున్నాయి. పేదరి కాన్ని నిర్ధారించేందుకు పట్టణ ప్రాంతాల్లో రోజుకు రు.20, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రు.11ల ఆదాయాన్ని మీరు నిర్ణయించారు. ఈ నామమాత్రపు ఆదాయ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా సమర్ధించుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజు జీవనానికి ఇది సరిపోదే..!? దీనిపై ప్రణాళికా సంఘం వివరణ ఇవ్వాలి' అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్‌) ఉన్న కుటుంబాల అర్హతను నిర్ణయించే విషయంలో కేంద్రం, ప్రణాళికా సంఘాలను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. ఈ అర్హతను నిర్ణయించడంలో వున్న వైరుధ్యాలపై వారంలోగా తనకు అఫిడవిట్‌ సమర్పించాలని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌ను సుప్రీం ఆదేశించింది.

1 comment:

  1. enti babu ekkada coppy chesaaavvvvvvvvvvv
    makkiki makki dinchudenaaaaaaa

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.